కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapally Municipal Chairman Elections news) క్షణానికో మలుపు తిరుగుతోంది. నిన్న గందరగోళ పరిస్థితుల్లో నేటికి వాయిదా పడ్డ ఎన్నిక..ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇవాళ ఉదయం ఎక్స్‌అఫిషియో సభ్యులతో సహా వైకాపా, తెలుగుదేశం కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బల్లలు చరస్తూ న్యాయం కావాలంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. కార్యాలయం బయటకు వచ్చి ఆందోళన కొనసాగించారు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని.., ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకొస్తున్న వైకాపా కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. కార్యాలయం బయట వైకాపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎన్నిక ప్రక్రియ అడ్డుకునేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని తెలుగుదేశం ఆరోపించింది.
మరోవైపు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రెండో రోజూ వాయిదా పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు.