చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రశంసలు TDP Manifesto 2024: రాజమహేంద్రవరం మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో.. మహిళలు, యువతకు పెద్దపీట వేసేలా ఉందని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీకాకుళం జిల్లా మాతలలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలతో అభిషేకం జరిగింది.
యువత, రైతుల అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టో ప్రకటించారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ సిద్ధం కావాలని మహిళలు పిలుపునిచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేళ చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సమరశంఖం పూరించారని విజయవాడలో టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఏడాది ముందే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.
మహిళలు, యువత, రైతులకు మేలు చేసేలా ప్రకటించిన పథకాలకు జనం నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు చిత్ర పటానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, బోడే ప్రసాద్ పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో తెలుగు మహిళలు నినాదాలు చేశారు. చంద్రబాబు చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి పాలాభిషేకం చేశారు.
"తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్ల మేర నడుస్తున్న పరిస్థితిని యువగళం పాదయాత్రలో లోకేశ్ చూశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుసుకుని.. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటింటికీ కుళాయిలు అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు మా నేత అందించగలరు. దీంతోపాటు నిరుద్యోగ భృతి కూడా అందించాం.. కానీ సీఎం జగన్ ఆ పథకాన్ని తొలగించారు." - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
గుంటూరులో స్థానిక లాడ్జ్ సెంటర్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి తెలుగు మహిళలు క్షీరాభిషేకం చేశారు. మహాశక్తి పథకం ప్రకటించిన చంద్రన్నకు థ్యాంక్యూ అంటూ మంగళగిరిలో మహిళలు నినదించారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మహాశక్తి పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలంటూ.. ప్రకాశం జిల్లా కనిగిరిలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు చిత్రపటానికి నెల్లూరులో పాలాభిషేకం చేశారు. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని నేతలు అన్నారు.
రాష్ట్రంలో ఇక వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నేతలు అన్నారు. మేనిఫెస్టో పేదలకు మేలు చేస్తుందంటూ ఎన్టీఆర్ భవన్ ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళా నేతలు కేక్‌కోసి సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో మహిళలు అండగా ఉంటారని కర్నూలులో నేతలు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: