TDP leaders strongly condemned the attack : గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పోలీసు శాఖను మూసేశారా.. వైకాపాలో విలీనం చేశారా..? అని మండిపడ్డారు. గన్నవరంలో వైఎస్సార్సీపీ సైకోల దాడిని ఖండిస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు. జరుగుతున్న ఒక్కో దాడి.. వైఎస్సార్సీపీ సమాధికి కట్టే ఒక్కో ఇటుక అని ఆయన అభివర్ణించారు.
పోలీస్ శాఖను మూసేశారా..? గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని ఉద్దేశించి.. పోలీసు శాఖను మూసేశారా..? వైకాపాలో విలీనం చేశారా..? అని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్... ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే.. పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.