తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ... ఆ పార్టీ నేతలు విజయవాడలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణశాఖ - టిడ్కో - చీఫ్ ఇంజనీరుకు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల మంజూరుపై టిడ్కో మేనేజింగ్ డైరెక్టరును కలిసి చర్చించాలని భావించినా... ఆయన అందుబాటులో లేకపోవడంతో చీఫ్ ఇంజనీరుతో సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు నిర్మించారని... తమకు సొంత ఇల్లు వస్తుందని ప్రజలు అప్పులు చేసి డబ్బులు చెల్లించారని వారు తెలిపారు. రంగులు వేస్తే గృహప్రవేశం చేసే ఇళ్లను కూడా కేటాయించకుండా నిలిపేశారని వారు ఆరోపించారు. జనవరిలోగా ప్రభుత్వం ఆ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, లేకుంటే.. ప్లాట్లు కేటాయించిన వారితో గృహాలను ఆక్రమింపజేస్తామని స్పష్టం చేశారు.