మద్య నిషేదం హామీతో మహిళల ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. మద్యానికి డబ్బులు వెచ్చించలేక కార్మికులు శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నాశిరకం మద్యం ధరలతో గత్యంతరం లేక శానిటైజర్, నాటు సారా తాగి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు పోయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం, కమీషన్లు తగ్గ కూడదని జగన్ రెడ్డి భావించటం.. మహిళలకు నమ్మక ద్రోహం చేయటమేనని విమర్శించారు. ఈ తుగ్లక్ మద్యం విధానానికి మహిళలు తప్పకుండా బుద్ది చెప్తారని హెచ్చరించారు.
ప్రతి రూపాయి కక్కిస్తాం: అయ్యన్నపాత్రుడు
విజయసాయిరెడ్డి టెండర్లు, దాని వెనుక ఉన్న దొంగలెక్కలన్నింటినీ బయటపెట్టి మింగిన ప్రతి రూపాయి కక్కిస్తామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. రాసిపెట్టుకో సాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు. "లిక్కర్ డాన్, ఇసుక దొంగ అయిన జగన్ రెడ్డికి పారదర్శకత, రివర్స్ టెండరింగ్ లాంటి పదాలు సెట్ కావు. 2 ఏళ్లలో సామాన్యుడికి ఇసుక అందివ్వలేని దద్దమ్మలది వైకాపా ప్రభుత్వం. మద్యపాన నిషేధం పేరుతో జగన్ బ్రాండ్లు అమ్ముతూ మహిళల మెడలో పుస్తెలు సైతం కొట్టేస్తున్న కేటుగాళ్ళు. వైకాపాది రివర్స్ టెండరింగ్ కాదు రివర్స్ దోపిడీ" అని అన్నారు.