"బాబాయ్ ని ఎవరు చంపారో అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. చిన్నానని చంద్రబాబు నరికేశాడన్న జగన్.. సీబీఐ దర్యాప్తును ఇప్పుడెందుకు వద్దంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణకు సీబీఐ వస్తే.. దిల్లీని గడగడలాడిస్తానన్న జగన్.. ఇప్పుడు తానే వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.
విజయమ్మ.. ముందుగా జగన్ను నిలదీయాలి: ఎమ్మెల్సీ మంతెన
"వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ నిలదీయాలి" అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. "విజయమ్మ బహిరంగ లేఖ ఆరాటం.. కుమారుడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే" అని చెప్పారు. రెండేళ్లుగా తండ్రిని చంపిన నిందితుల్ని శిక్షించాలని సునీతారెడ్డి చేస్తున్న ఆందోళన కనిపించట్లేదా అని ప్రశ్నించారు.