TDP leaders fire on CM Jagan: 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' తప్పుడు కేసులతో తెలుగుదేశం పార్టీని అడ్డుకోలేవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నేటి ప్రతీ చర్యకూ రేపు ప్రతిచర్య ఉంటుందని గుర్తుంచుకో అని హితవు పలికారు. నేడు తమ కార్యకర్త చిందించిన ప్రతి రక్తపు బొట్టుకూ రేపు సమాధానం చెప్తామన్నారు. పుంగనూరు, అంగళ్లులో దాడులకు ఉసిగొల్పింది జగన్ రెడ్డే అని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు నమోదు జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరితో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందన్నారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు కేసులని విమర్శించారు. రోడ్ షోలకు వస్తున్న జనాదరణ చూసి ఫ్రస్ట్రేషన్ మొదలైందన్నారు. జగన్ రెడ్డి పిల్ల చేష్టలు నవ్వు తెప్పిస్తున్నాయన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ పర్యటన రూట్‌లో వైసీపీ కార్యకర్తలకు ఏం పని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారని నిలదీశారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపై కేసులు పెట్టడం తుగ్లక్ రెడ్డికే చెల్లిందని ఆక్షేపించారు.
Devineni Umamaheswara Rao అంగళ్లు ఘర్షణలకు అసలు కుట్రదారులు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డి అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేసులు తమపై కాదు... చేతనైతే అసలు కుట్రదారులపై పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో తమ చిటికెన వేలు వెంట్రుక కూడా పీకలేరని పేర్కొన్నారు. 13 కార్లు ధ్వంసం చేసి.. తిరిగి మా పైనే కేసులా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రాళ్లేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు.
Ashok Gajapathirajuచిత్తూరు జిల్లా అంగళ్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదుని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఖండించారు. ఎవరిపైన కేసులు పెట్టాలి, ఎవరిపైన పెట్టకూడదు అనే విచక్షణ వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ విజయనగరం జిల్లా కార్యాలయంలో అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే కేసులు పెడుతున్నారని అన్నారు. వారి నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ(TDP)పై అనేక కేసులు పెట్టారని, ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేయడానికి రాజ్యాంగానికి విరుద్ధగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలా దారుణమన్నారు. చంద్రబాబు కి సెక్యూరిటీ తీసేస్తే.. చంపేస్తాం అని స్పీకర్ మాట్లాడడం సిగ్గుచేటు. అలాంటి వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. చంద్రబాబు మీద రాళ్లు వేసిన ఒక్కరిపైనా అయినా కేస్ నమోదు చేశారా..? అని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. డీజీపీ పదే పదే చేతులు కట్టుకొని హైకోర్టు ముందు నిలబడడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో మంత్రులుతమ పని ఏ మాత్రం చేయడం లేదని విమర్శించారు. అభివృద్ధి మాత్రం లేదు పేపర్ ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని అశోక్ గజపతి రాజు దుయ్యబట్టారు.