ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలి..!
అచ్చెన్నాయుడి అరెస్ట్, పట్టాభిపై దాడిని తెదేపా శ్రేణులు ఖండించాయి. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, భయపెట్టి బెదిరిస్తూ నాటుబాంబులు, వేటకొడవళ్లతో ఏకగ్రీవాలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. అచ్చెన్నాయుడిపై నాన్ బెయిలబుల్ కేసులుపెట్టి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఎలాంటి ఏకగ్రీవాలు కోరుకుంటోందో ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కేసులు, బెదిరింపు ధోరణిలో సాగుతున్న ఏకగ్రీవాలు, తెదేపా నేతల అరెస్ట్ వ్యవహారంపై ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎస్ఈసీ స్పందిస్తే ఎన్నికలు, ఎన్నికల వ్యవస్థపైనా ప్రజలకు బలమైన నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
టెక్కలి వైకాపా ఇంఛార్జ్ రౌడీ షీటరైన దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు చర్యలు తీసుకోకుండా అచ్చెన్నను జైలుకు పంపటమేంటని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. అభ్యర్థులను బెదిరించిన వైకాపా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ నేతలతో ఒకలా ప్రతిపక్ష పార్టీ నేతలతో మరోలా వ్యవహరించటం పోలీసులకు తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికి ఒకేలా ఉండాలని హితవుపలికారు. తక్షణమే పోలీసులు దువ్వాడ శ్రీనివాస్, కన్నబాబు రాజులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.