అన్నా క్యాంటీన్లను మూయలేదని మానవ హక్కుల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం నయవంచనే అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజలనే కాకుండా ఎన్హెచ్చార్సీని సైతం వైకాపా ప్రభుత్వం దగా చేయటం గర్హనీయమన్నారు. దేన్నైనా కూల్చాలన్నా.. ధ్వంసం చేయాలన్నా రిమోట్ కంట్రోల్ సీఎం జగన్ చేతిలోనే ఉందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతోనే మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్జిపై దాడిని ఖండిస్తున్నాం
న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నామన్నారు. వైకాపా పాలనలో దళితులకు భద్రత లేదనటానికి ఇది మరో సాక్ష్యమని చెప్పారు. జడ్జి రామకృష్ణపై దాడి వెనుక చిత్తూరు వైకాపా నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. అందువల్లే కేసు నమోదు చేయకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జడ్జికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.