Varla Ramayya complaint : కాకినాడ పోర్టు ద్వారా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న బియ్యం మాఫియాపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేయాల్సిన బియ్యం విదేశాలకు తరలిపోవడం దారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం మాఫియా పురుడుపోసుకుందన్నారు.
' రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది' - తెదేపా నేత వర్ల రామయ్య వార్తలు
Varla Ramayya complaint :రాష్ట్రంలో బియ్యం మాఫియాపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అ.ని.శా. అధికారులకు తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. రేషన్ బియ్యం తరలింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
2020-21 లో రూ.7,972 కోట్ల విలువ గల 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా తరలించారని మండిపడ్డారు. 2021-22 లో ఇప్పటికే రూ.7,710 కోట్ల విలువ గల 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి చేశారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఐవరీకోస్ట్, టాంగో, సెనెగల్, బెనిన్, గునియా లాంటి ఆఫ్రికా దేశాలకు అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి చేసిన బియ్యం మొత్తం మన రాష్ట్రానికి చెందినదేనన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయంటే అది పీడీఎస్ బియ్యం సేకరించడం ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పారు. కాకినాడ ఓడరేవు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యం వెనుక అధికార వైకాపా నేతల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అనిశాకి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:Pawan Kalyan: నరసాపురంలో పవన్ పర్యటన నేడు