తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసైనా.. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ప్రారంభించారని గుర్తు చేశారు. తాజాగా డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల అమ్మక్యాంటీన్లు ధ్వంసం చేశారని అన్నారు.
దాడులకు పాల్పడిన సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించి అమ్మ క్యాంటీన్లు కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో రూ.5కే మూడు పూటలా పేదలకు భోజనం పెట్టేందుకు 386 అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభిస్తే.. వైకాపా అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయించారని మండిపడ్డారు. ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన పథకాలను తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో వ్యవహరించాలి