ఏలూరు వింతవ్యాధి ఘటనకు నాసిరకం క్లోరినే కారణమని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించట్లేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వింతవ్యాధి, మాస్ హిస్టీరియా వచ్చింది ముఖ్యమంత్రి, మంత్రులకేనన్నారు. ఈ రోజుకీ వ్యాధికి గల కారణాలను చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇంతవరకూ పరీక్షల ఫలితాలు బయటపెట్టలేదని అన్నారు.
లోకేశ్ ఏలూరు పర్యటన తర్వాతే సీఎం స్పందించి పెళ్లికి వెళ్తూ మొక్కుబడిగా వచ్చి బాధితులను పరామర్శించారని మండిపడ్డారు. వింత వ్యాధి వెలుగులోకి వచ్చిన 5వ తేదీకి 2 వారాల ముందే పంపుల చెరువు ప్రాంతంలో ఒకరిద్దరిలో వ్యాధి లక్షణాలు బయటపడినా.. ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవటం వల్లే అది తీవ్రమైందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఎందుకు దీనిని గుర్తించలేకపోయాయని రామానాయుడు నిలదీశారు.