మంత్రి పేర్నినానిపై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. జిల్లా ఎస్పీ మీడియా ముందు వ్యక్తం చేసిన అనుమానాన్నే తానూ మాట్లాడానని వివరణ ఇచ్చారు. పేర్నినానిపై దాడి అంశంలో తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు 91 సీఆర్పీసీ ప్రకారం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చినట్టు పేర్కొన్నారు. పేర్ని నానిపై జరిగిన దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారని కొల్లు రవీంద్ర తెలిపారు. పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకున్నారని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
నాగేశ్వరరావును తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా వైకాపా నేతలు ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తెదేపాకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో పలువురు తెదేపా నేతలను విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. న్యాయపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.