ప్రచారం కోసం నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి రూ. 2,600 కోట్లు దుర్వినియోగం చేశారని.. తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈ ఖర్చు మొత్తాన్ని సీఎం జగన్ వ్యక్తిగతంగా భరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠ్య పుస్తకాలు, చివరకు మరణ ధ్రువీకరణ పత్రాలపైనా ముఖ్యమంత్రి ఫొటో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాలంటీర్లపై పార్టీ నేతలు పెత్తనం చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు కష్టాలు కొనితెచ్చుకోవద్దంటూ హితవు పలికారు. విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది నిజమో..? లేక ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం చెప్పింది నిజమో? సీఎం జగన్ స్పష్టం చేయాలన్నారు. ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు తీసుకోకుండా తాత్కాలిక పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.