శ్రీశైలం వరకూ 18 రోజుల పాటు కొనసాగిన వరద నీటిని రాయలసీమలోని కుప్పం తీసుకెళ్లే అవకాశం ఉన్నా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని రాయలసీమకు మరల్చే అవకాశం ఉన్నా...అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమరావతి రైతుల పొలాలు, చంద్రబాబు ఇల్లును ముంచేందుకే వరదను వదిలారని దేవినేని ఆరోపించారు.
కడప జిల్లా కరవు ప్రాంతంగా మారిందన్న దేవినేని ఉమ...సోమశిలకు నీళ్లు తీసుకెళ్లలేదన్నారు. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో నీటి ఎద్దడి పరిస్థితులు ఉంటే.. ఆప్రాంతాలకు వరద నీటిని మరల్చకుండా కేవలం చంద్రబాబు ఇంటిని ముంచే ప్రయత్నాలే జరిగాయని ఆరోపించారు. జలవనరుల శాఖ మంత్రికి కనీసం నీటి లెక్కలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. పరిపాలన అంటే మాటలు చెప్పినంత సులువు కాదని దేవినేని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం విదేశీ పర్యటనలేంటని ప్రశ్నించారు. వరద బాధితులు, రైతులను వదిలి మంత్రులు సన్మనాలు చేయించుకుంటున్నారని విమర్శించారు.