DHULIPALLA FIRES ON YSRCP : రాష్ట్రంలో పరిశ్రమలన్నీ తెలంగాణకి తరలిపోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోజూ జగన్మోహన్ రెడ్డి ఫొటోకి దణ్ణం పెట్టుకుంటోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. ఏపీలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్మోహన్ రెడ్డి బినామీలైనా అయి ఉండాలి, లేదా ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సిన దుస్థితి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులు, వైసీపీ నేతల వసూళ్లు తాళలేకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్న ధూళిపాళ్ల.. రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్‌ఫ్లోకు బదులుగా రివర్స్‌ఫ్లో జరుగుతుండటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఏపీ.. నేడు 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఉన్న పరిశ్రమల్ని బెదిరించి తమ వారికి కట్టబెట్టుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆక్షేపించారు. కాకినాడ సెజ్, గంగవరం పోర్టు వంటివే ఇందుకు ఉదాహరణలని వెల్లడించారు.