చేనేత దినోత్సవం నాడే చేనేత కార్మికుడు నారాయణ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో ఉన్న దుర్భర పరిస్థితికి అద్దం పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తెదేపా పథకాల వల్ల చేనేత రంగంలో ఒక్కొక్క నేతన్న ఏడాదికి రూ.50 వేలకు పైగా లబ్ధి పొందారని గుర్తు చేశారు. తెదేపా పథకాలను రద్దు చేసిన వైకాపా సర్కార్... కేవలం రూ.24వేలు మాత్రమే ఇస్తోందని మండిపడ్డారు.
అక్రమ మైనింగ్‌తో కోట్లు...
గత పథకాలను పునరుద్ధరించి సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని కాపాడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి జగన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. నరేగా బిల్లుల చెల్లింపుపై కోర్టుల్లోనూ, ప్రజా క్షేత్రంలోనూ తెదేపా తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు. సీఎం జగన్... భారీగా అప్పులు చేస్తూ అవినీతి పాల్పడుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా గండేపల్లిలో అక్రమ మైనింగ్ పై పార్టీ తరఫున నిజనిర్థరణ కమిటీ వేస్తామన్న చంద్రబాబు.. రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్‌తో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విత్తనాల పంపిణీ, ఇన్ పుట్ సబ్సీడీ, పంట బీమా చెల్లింపుల్లో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.