TDP leaders about YS Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని,.. ఆయన దర్శకత్వంలోనే మర్డర్ జరిగిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఎంపీ టికెట్ వివాదమే వివేకాను చంపడానికి కారణమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేసు విచారిస్తున్న సీబీఐ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న జగన్..: తన తప్పులు బయటపడుతుంటే.. సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు నాలుగేళ్లయినా ఎందుకు విచారణ పూర్తి కావడం లేదని అయ్యన్న ప్రశ్నించారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు..? జగన్‌రెడ్డా..? సజ్జల రామకృష్ణారెడ్డా? అని నిలదీశారు. వివేకానంద రెడ్డి హత్యను అప్పట్లో చంద్రబాబుకు ఆపాదించిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక హత్య కేసును మాయం చేయాలని చూశారని తెలిపారు. సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకి వస్తున్నాయని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ఆమెను చూస్తే ప్రజలు కూడా న్యాయం జరగాలని కోరుతున్నారని చెప్పారు. రాజధాని విషయంలో గందరగోళంగా ప్రకటనలు చేస్తున్నారని, ఏ చట్టం ప్రకారం విశాఖను రాజధానిగా పెడతారని ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారని అయ్యన్న మండిపడ్డారు.
అమరావతి రాజధానిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపిన జగన్.. సుమారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. అక్కడ రాజధాని.. ఇక్కడ రాజధాని అంటూ మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చ తుగ్లక్ అనుకోవాలో, ఇంకేం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవేనా..? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్.. ఏదైనా ఇష్యూ వస్తే ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమే. - చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి