గత 18 నెలలుగా రాష్ట్రం నుంచి 200కు పైగా కంపెనీలు వెళ్లిపోయాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. యువతను నిర్వీర్యం చేసి వాలంటీర్లగాను, తోపుడుబళ్లు నడిపే వాళ్లగాను, మద్యం దుకాణాల్లో ఉద్యోగులుగా నియమించారని మండిపడ్డారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసులోని యువతలో ఉండే ఫైర్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వైకాపా ప్రభుత్వానికి తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కృషితో వచ్చిన పెట్టుబడులు, ఉద్యాగాలను మంత్రే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారంటూ సంబంధిత ఫోటోలను తన ట్విట్టర్‌కు అయ్యన్న జతచేశారు. విజయసాయిరెడ్డి పెట్టుబడుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖలో పులివెందుల ముఠాని దించి, అనేకమంది పెట్టుబడిదారుల్ని హింసిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కంపెనీలు పులివెందుల పంచాయతీ తట్టుకోలేక పారిపోయాయో అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.