జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున 2022కి కార్యకర్తలు సిద్ధం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జమిలి రాకుంటే 2014 ఫలితం 2024 లో పునరావృతం కావాలని ఆకాంక్షించారు. విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీ సమీక్షలు రాత్రి వరకూ సాగాయి. తొలిరోజు పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి
పలు నియోజకవర్గాల సమీక్షలో లోటుపాట్లను కార్యకర్తలు అధినేతకు కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. పెడన నియోజకవర్గం సమీక్షలో అభ్యర్థి టిక్కెట్‌ను చివరి నిమిషం వరకూ నాన్చటంతోనే.. స్వల్ప తేడాతో ఓడిపోయామని తెలిపారు. అయిదేళ్లు అధికారంలో ఉండగా కార్యకర్తలకు తగు న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పార్టీకి ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయించారనే ఆత్మవిమర్శ చేసుకోవాలని.. చంద్రబాబు అన్నారు.
మీరు మారాలి
కైకలూరు సమీక్షలో 2014లో భాజపా అభ్యర్థిని గెలిపించిన క్యాడర్ తాజా ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోవటానికి గల కారణాలను చంద్రబాబు విశ్లేషించారు. అభివృద్ధిపై దృష్టి సారించి రాజకీయాలను పట్టించుకోకపోవటం వల్లే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని.. ఈ విషయంలో అధినేత వ్యవహార శైలి మారాలని కొందరు కార్యకర్తలు సూటిగా స్పష్టం చేసినట్లు సమాచారం.