నేడు కొండపల్లిలోని అక్రమ మైనింగ్ ప్రాంతానికి తెదేపా నిజనిర్ధరణ కమిటీ వెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు తెదేపా అధినేత చంద్రబాబు.. కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా.. ముందస్తుగానే పోలీసులు నిలువరించారు. నిన్నటి నుంచే కమిటీ నేతలను గృహ నిర్బంధం చేస్తూ వచ్చారు. కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. దాదాపు అందరినీ హౌజ్ అరెస్ట్ చేశారు.
నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. శుక్రవారం నుంచే వసంతరాయపురమలోని ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనంద్ బాబును గృహ నిర్బంధం చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ ఉదయం కొండపల్లి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనంద బాబును పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు.. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా తెదేపానేతలు నినాదాలు చేశారు. తెదేపా నేతలకు పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది.
వైకాపా ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగడం లేదని నిరూపించాలని ఆనంద బాబు సవాల్ విసిరారు. గోదావరి జిల్లాలో కూడా విలువైన ఖనిజాన్ని వైకాపా నేతలు తవ్వుకుంటున్నారని.. జాతీయ హరిత ట్రిబ్యునల్ చివాట్లు పెట్టిందని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడ్డారు. తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదుతో చట్టాన్ని ఎత్తివేయించేందుకు జగన్ యత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇరువురి నేతలకు నోటీసులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళుతున్న ఇరువురు నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్ద అడ్డుకున్నారు. రాత్రి నుంచే పోలీసులు వారి ఇళ్ల వద్ద పికెట్ నిర్వహించారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో వెళ్లడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఇరువురు నేతలు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతల మధ్వ వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు ఇరువురి నేతలకు నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితం చేశారు.
పరామర్శకు కూడా వెళ్లనివ్వరా..!
నందిగామ నుంచి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండపల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను నందిగామ సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. .మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి బయటకు వచ్చేది ప్రయత్నించగా అడ్డుకొని లోపలకు పంపించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. దీనికి సీఐ అనుమతించలేదు. ఇంట్లోకి పంపించి గేట్లు మూసేశారు. దీంతో పోలీసులు ..తెలుగుదేశం నాయకులు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు