Gudivada Casino issue: గుడివాడ క్యాసినో వ్యవహారం రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. గుడివాడలోని కె కన్వెన్షన్ సెంటర్ పరిశీలనకు వెళ్లిన నిజనిర్ధరణ కమిటీ అడ్డగింత, వైకాపా దాడులు, అరెస్టులపై తెలుగుదేశం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్యాసినో నిర్వహణపై ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా... పరిశీలనకు వెళ్లిన తమను అడ్డుకోవడమేంటని నిలదీశారు. గుడివాడలో వైకాపా శ్రేణులు తమపై దాడులకు పాల్పడితే వారిని వదిలేసి తమను అరెస్ట్ చేయడమేంటని ధ్వజమెత్తారు. క్యాసినో నిర్వహణ సహా, శుక్రవారం గుడివాడలో జరిగిన మొత్తం వ్యవహారంపై ఏలూరు డీఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. క్యాసినో నిర్వహణకు సంబంధించిన వీడియో ఆధారాలను ఫిర్యాదుకు జతచేశారు. గుడివాడ పర్యటనలో తమపై హత్యాయత్నానికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఐజీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు అందజేశారు.
క్యాసినోలు, అర్ధనగ్న ప్రదర్శనలు, జూదక్రీడలతో .. మంత్రి కొడాలి నాని రాష్ట్రం పరువు తీస్తుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటీ నిలదీసింది. గుడివాడలో శుక్రవారం నాటి ఘటనలో తెలుగుదేశానిదే తప్పు అన్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ ఆరోపణలు చేయడం దారుణమని.... మండిపడింది. క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే... ఆత్మహత్యకు సిద్ధమని మంత్రి కొడాలి నాని విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బొండా ఉమ అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని.. డిమాండ్ చేశారు. క్యాసినో నిర్వహించినట్లు నిరూపించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిసవాల్ విసిరారు.
తెదేపా నేతలపై కేసులు..
క్యాసినో వ్యవహారాన్ని పరిశీలించేందుకు... శుక్రవారం గుడివాడ వెళ్లిన తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజనిర్ధరణ కమిటీలోని ఆరుగురు సభ్యులతో పాటు మరో 20 మందికి పైగా తెలుగుదేశం నేతలపై.. వివిధ సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. బొండా ఉమ ఫిర్యాదు మేరకు.. మంత్రి కొడాలి నాని ఓఎస్‌డీ శశిభూషణ్, ఇతరులపై.. పోలీసులు కేసులు పెట్టారు. మరోవైపు తమపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేస్తే.... 307 సెక్షన్ కింద కాకుండా కారు అద్దం పగలగొట్టడంపై మాత్రమే కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం నేతలు తప్పుబట్టారు.
గుడివాడలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే...
TDP Leaders Arrest in Gudiwada: గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా గోవా తరహాలో క్యాసినో నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించాలని నిర్ణయించింది. పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు మంగళగిరి నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరారు. అనుమతి లేదని వీరిని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మొదట దావులూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు. పామర్రు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను నిలిపివేశారు. ఒక్క వాహనానికే అనుమతి ఇస్తామనడంతో పోలీసులు, తెదేపా నేతలకు వాగ్వాదం జరిగింది. తర్వాత 10 వాహనాలను అనుమతించారు. మళ్లీ గుడివాడలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఒకే ఒక్క వాహనాన్ని పార్టీ కార్యాలయానికి అనుమతించారు. అప్పటికే కె-కన్వెన్షన్ వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కె-కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలిస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెదేపా కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు.
తెదేపా కార్యాలయంపై రాళ్ల దాడి..
ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యాలయం వైపు దూసుకురావడంతో తెదేపా కార్యకర్తలు, నాయకుల చుట్టూ పోలీసులు వలయాన్ని ఏర్పాటుచేశారు. ఇరువైపులా నినాదాలు మార్మోగాయి. భారీగా ఉన్న వైకాపా కార్యకర్తలు పోలీసుల వలయం ఛేదించుకుని తెదేపా కార్యాలయంపై రాళ్లు విసిరారు. బారికేడ్ల వద్ద ఉన్న బొండా ఉమా కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ కారును చూసి.. ఇది వాడి కారేరా అంటూ బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో రాళ్లతో అద్దాలను పగలగొట్టడం కనిపించింది. వైకాపా కార్యకర్తల దాడిలో ముళ్లపూడి రమేష్ చౌదరి అనే కార్యకర్త గాయపడ్డారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు రాళ్లదాడులతో పాటు పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల ముందే ఈ దాడులు జరుగుతున్నా.. నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో గుడివాడ డీఎస్పీ, సీఐలు తమ వద్దకు వచ్చి వైకాపా కార్యకర్తల దాడిని తాము నిలువరించలేమని, అత్యవసరంగా అరెస్టు చేస్తున్నామంటూ తమ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పామర్రు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెదేపా నేతలు తెలిపారు. అనంతరం పట్టణంలో ఉద్రిక్తత సడలింది. పట్టణంలో ర్యాలీగా వెళ్లిన వైకాపా కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
ఇదీ చదవండి:Gang rape: బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్