బీసీలకు అండ తెదేపా జెండా అని గాఢంగా నమ్మి పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ అన్నారు. పార్టీ ఎన్నో పదవులిచ్చి తనకు గౌరవం కల్పించిందని.. పార్టీలోని కొంతమంది నాయకుల వలన పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. బీసీలకు ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్లు తెదేపా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసిందని.. వైకాపా ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు.
తెదేపా గెలుస్తుంది అనే స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ రెబెల్ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. తెదేపాలో ఉంటూ తెదేపాను ఓడించాలని తన అనుచరులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. రెబెల్ అభ్యర్థికి బోండా ఉమా.. తన కుటుంబ సభ్యులతో ప్రచారం చేయించారన్నారు. తెదేపా నాయకుడు తెదేపా అభ్యర్థిని ఓడిపోయేలా చేసింది విజయవాడలో తప్ప ఎక్కడా జరిగి ఉండదన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబును కోరుతున్నామన్నారు.