‘ప్రజాసేవకే రాజకీయం తప్ప, అణచివేతల కోసం కాదు. రౌడీయిజం, తప్పుడు కేసులు, వేధింపులతో అణగదొక్కడమే పనిగా వైకాపా పెట్టుకుంది. తెదేపా చాలా చైతన్యవంతమైన పార్టీ. మా అందరిలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది. భయం తెలియని, త్యాగాలకు వెనుదీయని పార్టీ మాది. ఖబడ్దార్.. మీ ఆటలు సాగవు. మీరు గాలికి వచ్చారు. గాలికే కొట్టుకుపోతారు’ అని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన విమానంలో గన్నవరం వచ్చారు. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహంవద్ద చంద్రబాబు జ్యోతి వెలిగించి, పుష్పాంజలి ఘటించారు. ‘సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత దేశ చరిత్రలో ఆయనొక్కడిదే. పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, శాశ్వత గృహ నిర్మాణ పథకం, పేదలకు చీర, ధోవతి, రైతులకు రూ.50కే విద్యుత్తు వంటివన్నీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలే. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలించారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారు. బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి చాలా లేఖలు రాశాం. మహానాడులో తీర్మానించి పంపించాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కేంద్రం వెంటనే స్పందించి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి. అప్పటి వరకు తెదేపా పోరాడుతుంది’ అని పేర్కొన్నారు.
సీసీటీవీ ఆధారాలుంటే బయటపెట్టండి
దేవాలయాలపై దాడుల్లో తెదేపా నాయకుల పాత్రపై సీసీటీవీ ఆధారాలుంటే బయటపెట్టాలని చంద్రబాబు డిమాండు చేశారు. ‘తెదేపా కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదు. పార్టీని అంతం చేయాలని గతంలోనూ చాలా మంది పగటి కలలు కన్నారు. తెదేపా పునాదుల్ని కదిలించే శక్తి ఎవరికీ లేదు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే పార్టీ మరో 20-30 ఏళ్లపాటు బలంగా తయారవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులకు పాల్పడితే సహించేది లేదు’ అని పేర్కొన్నారు.