సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే ఆరోపణలపై జ్యోతిశ్రీ అనే యువతిని అర్థరాత్రి వరకు స్టేషన్లో ఉంచటం దుర్మార్గమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకానికి ఇది చీకటి రోజని అన్నారు. మహిళల పోస్టుల ధాటికి జగన్ రెడ్డి భయపడ్డారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ముసలి, ముతక, మహిళ అనే భేదం లేకుండా 14రోజుల రిమాండ్ పథకం అమలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. తెదేపా మహిళా కార్యకర్తలు, అమరావతి మహిళలపై అసభ్య పోసులు పెట్టినపుడు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో సీఐడీ, డీజీపీ సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
వైకాపా సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతల్ని దూషిస్తూ పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. పోస్టులు పెట్టడం పౌర స్వేచ్ఛ అని చెప్పిన వైకాపా నేతలు, మహిళలు పోస్టులు పెడితే ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని నిలదీశారు. మహిళలకు వైకాపా క్రూర జంతువులకు ఉన్న పౌర స్వేచ్ఛ లేదా అని అనిత ప్రశ్నించారు.
మహిళల రక్షణ పట్టించుకోకుండా వైకాపా నేతల రక్షణయే ప్రాథమిక ధ్యేయంగా పోలీసుల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవించే హక్కు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న జగన్ రెడ్డికి ముందు ముందు తీవ్ర పర్యావసానాలు తప్పవని హెచ్చరించారు. మహిళల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించటం ప్రజాస్వామ్యం కాదని గుర్తించుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
ఇదీ చదవండి: