VANGAVEETI RANGA DEATH ANNIVERSARY : వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా పలువురు నాయకుల నివాళులర్పించారు. రంగా విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ నేత బోడే ప్రసాద్, జనసేన పోతిన వెంకట మహేష్‌లు పూల మాల వేసి నివాళులర్పించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని ఆయన కుమారుడు రాధా తెలిపారు. పేదల పెన్నిధి అయిన రంగాను 34 ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.
కోట్ల మంది అభిమానం రంగాకే సొంతం: వంగవీటి మోహనరంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని.. కోట్ల మంది ప్రజల అభిమానం ఆయనకే సొంతమని టీడీపీ నేత బోడే ప్రసాద్ అన్నారు. కొంతమంది వారి పార్టీ కోసం రాధాను వాడుకుని వదిలేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. ప్రజలు వంగవీటి రాధాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
రంగా స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తాం: గుడివాడలోని ఏజీకే స్కూల్ వద్ద వంగవీటి రంగా విగ్రహానికి టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు, జనసేన నేతలు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొడాలి నాని గుడివాడలో 5వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. 20 ఏళ్ల నుంచి గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమం జరుగుతోందని.. ఆయన స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తామని తెలిపారు. కొడాలి నానిని గుడివాడ నుంచి తరిమి కొడతామన్నారు. రాత్రి గుడివాడలో పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని సొంత మనుషులే అని ఆరోపించారు. మరోసారి తెలుగుదేశం శ్రేణుల జోలి కొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.