కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టు గత 15 సంవత్సరాలుగా వివిధ దశల్లో మరమ్మతులకు నోచుకోక అంతంతమాత్రంగానే ఉపయోగంలో ఉందని అక్కడి రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు వరదలతో వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ప్రాజెక్టు లేకపోవడం విచారకరమని వాపోయారు. త్వరలో పూర్తి కానున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యీయి. అయితే ఆ మేరకు నిల్వ చేసేందుకు ప్రాజెక్టు సామర్థ్యం పెంచకపోవడం వల్ల నీళ్లు వృథా అవుతాయేమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లైనా మరమ్మతులు లేవు
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీని వల్ల 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరు సైతం నిల్వ ఉంచలేని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం నీరు.. ప్రాజెక్టులోకి మళ్లించే నాటికి జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు.