ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టే నియామకాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పించే జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయజాలదంటూ ఆధార్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇతర వ్యాజ్యాలతో కలిసి విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం పిటిషన్ విచారణ చేపట్టింది. ఏజెన్సీల్లో నియామకాలు పూర్తిగా గిరిజనులతో చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 3ను సవాల్ చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు 2002లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతేడాది ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సమీక్షించాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గిరిజన సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. తాజాగా ఆధార్ సొసైటీ తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక రివ్యూ పిటిషన్లు దాఖలైనందున వాటితో పాటు ఈ పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం తెలియజేసింది.