కుటుంబం, సమాజం, మానసిక సంఘర్షణ. ఈ మూడు అంశాలతో ఇమడలేక బాల్యం సతమతమౌతోంది. కొన్ని సమయాల్లో చిన్న చిన్న ఘర్షణలే పెద్దవిగా మారి ప్రాణాలు తీసేందుకు పురిగొల్పుతున్నాయి. ఇలాంటి వారిని చక్కదిద్ది, చిన్నారులను సరైన మార్గంలో పెట్టడం అవశ్యం!
మానసిక ఎదుగుదల లేకపోవడం సమస్యే..
పిల్లల్లో నిర్ణయాత్మక శక్తిని పెంచే మెదడు భాగం 7 నుంచి 12 సంవత్సరాల మధ్యలో అభివృద్ధి చెందుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. మరికొందరికి ఇంకొంత సమయం పట్టవచ్చు. వారి మనసులో కలిగే పరిణామాలకు అనుగుణంగా విచక్షణారహితంగా కొన్ని కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వయస్సులో వారి పట్ల పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు.
పరిసరాలు, పెంపకం కీలకం...
మొక్క ఏపుగా పెరగాలంటే నీరు, పోషకాల వంటివి సరిగా అందుతుండాలి. అప్పుడే అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ.. మహావృక్షంగా ఎదుగుతుంది. మనిషి జీవితం కూడా ఇటువంటిదే! బాల్యం సరైన మార్గంలో నడవాలి అంటే.. పరిసరాలు, పెంపకం అన్నీ సమగ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పిల్లాడి జీవితం ఉన్నతంగా మారుతుంది. ఓ మనిషి జీవితంలో బాల్యం ఎంతో కీలకం... అది సక్రమమైన దారిలో వెళ్లినప్పుడే అతని జీవితం ఆదర్శంగా ముందుకెళుతుంది.