ఎయిడెడ్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏజీఎస్‌జీఎస్ కళాశాలకు చెందిన విద్యార్థులు గత మూడు రోజులుగా చేపట్టిన ఉద్యమం బుధవారం ఉద్ధృతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని నినదిస్తూ పోలీసు వలయాన్ని దాటుకొని బయటకు వచ్చారు. అదే సమయంలో వారికి నచ్చజెప్పేందుకు నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి కళాశాల వద్దకు రాగా.. పోలీసులు ఆమెను లోపలకు వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు. దాంతో ఆమె చాలాసేపు గేటు బయటే నిల్చొని విద్యార్థులతో మాట్లాడారు. అదే సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి సైతం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిద్దరూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు.విద్యార్థులు కళాశాల గేటు దాటి బయటకు వచ్చి ఉయ్యూరు ప్రధాన కూడలిలో బైఠాయించారు. దాదాపు మూడు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. ఎమ్మెల్యే పార్థసారథి, ఆర్డీవో రాజ్యలక్ష్మిలు కళాశాల వర్గాలు, విద్యార్థి నాయకులతో చర్చించగా..మధ్యాహ్నం 3.30 గంటలకు ఆందోళన విరమించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, మండల కార్యదర్శి సుకేష్‌ల నేతృత్వంలో ఆందోళన జరిగింది.
విద్యార్థులపై ఆర్థిక భారం ఉండదు: ఎమ్మెల్యే పార్థసారథి
ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా చూస్తామని, అధిక ఫీజుల వసూలును నిరోధిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారది హామీ ఇచ్చారు. సిద్ధార్థ యాజమాన్యంతోనూ చర్చించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని, ఏజీఎస్‌జీఎస్‌ను ప్రభుత్వ కళాశాలగా మార్పు చేసే అవకాశాలను కచ్చితంగా పరిశీలిస్తామన్నారు.