రాష్ట్రవ్యాప్తంగా 3,600 మందికి పైగా పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. కొందరు ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో.. మరికొందరు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. ఇప్పటివరకు 1893 మంది కోలుకున్నారు. వీరిలో 80 శాతం మంది తిరిగి విధులకు హాజరవుతున్నారు. మిగిలినవారు విశ్రాంతి సమయం పూర్తయ్యాక విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
- ఒక్క జులైలోనే 3,200 మందికిపైగా
మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్ మొదలైన నాటినుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45 మంది పోలీసులు మాత్రమే కొవిడ్ బారిన పడ్డారు. వారంతా కోలుకున్నారు. అన్‌లాక్ మొదలయ్యాక జూన్ మొదటి వారంలో 39 మందికి ఈ వైరస్ సోకింది. ఆ నెలాఖరుకు ఈ సంఖ్య 230కు పెరిగింది. జులైలో ఆంక్షలు దాదాపు సడలించడంతో కేసుల ఉద్ధృతి పెరిగింది. ఆ ఒక్క నెలలోనే 3,200 మందికిపైగా పోలీసులు వైరస్ బారిన పడ్డారు. రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో మిగతా వారిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. 55ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని కార్యాలయ విధులకు వినియోగించటంవంటి చర్యల వల్ల ముప్పు తగ్గింది.
- ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. ధైర్యం నింపుతూ
తమ సిబ్బందికి కొవిడ్ వచ్చిందని తెలిసిన వెంటనే ఆయా జిల్లాల ఎస్పీలు, డీఐజీలతో పాటు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారు. బాధితులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలిస్తున్నారు. అదనపు డీజీపీ స్థాయి అధికారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ బాధ్యతలను అప్పగించారు. కరోనాను జయించిన సిబ్బందికి ఆయా స్టేషన్లలో ఘనస్వాగతం పలుకుతూ మనోబలాన్ని పెంచుతున్నారు.
- కరోనా నుంచి కోలుకున్న పోలీసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే...
ఆందోళనతోనే అనర్థం
మొదట్లో శ్వాస ఇబ్బందితోపాటు విపరీతమైన దగ్గు వచ్చింది. న్యూమోనియా మొదలైంది. సీటీ స్కాన్ చేయించటంతో కరోనా నిర్ధారణ అయింది. వెంటనే ఆసుపత్రిలో చేరా. వారం తర్వాత ఈ లక్షణాలు తగ్గాయి. నీరసంగా ఉండటంతో కొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో ఉన్నా. కోలుకోవటంతో 2 రోజుల కిందట మళ్లీ విధుల్లోకి చేరా. ధైర్యంగా ఉంటే త్వరగా కోలుకోవచ్చు.-ఎం.వెంకటరమణ, డీఎస్పీ, కల్యాణదుర్గం సబ్‌డివిజన్