రాష్ట్రంలో ఈ ఏడాది మెరుగైన వర్షపాతం నమోదైంది. జూన్ తర్వాత ఇప్పటివరకు సాధారణం కన్నా 25% అధిక వర్షం కురిసింది. రాష్ట్రంలో సగటున ఇప్పటివరకు 873.6 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. ఈ ఏడాది 1,095.7 మిల్లీమీటర్లు కురిసింది. ఎప్పుడూ కరవుతో ఉండే రాయలసీమ జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో సాధారణ కన్నా 75% అధికంగా కురవడం విశేషం. దాంతో జలాశయాలన్నీ మొదట్లో కళకళలాడాయి. ప్రస్తుతం సగం వరకు అంటే 265 టీఎంసీల నీళ్లున్నాయి. ఇంత నీరున్నా ధవళేశ్వరం బ్యారేజి కావడం, గోదావరికి ఎగువ నుంచి ప్రవాహాలు ఆగిపోవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో 8 లక్షల ఎకరాల సాగు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శ్రీశైలం జలాశయంలోనూ నీళ్లున్నా కేసీ కెనాల్ కింద కూడా కొంతమేర ఆయకట్టుకు నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. తుంగభద్ర నుంచి ఇంకా రెండు టీఎంసీల వరకు కేసీ కెనాల్ కోటా కింద తీసుకునే వెసులుబాటు ఉన్నందున ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.
కొన్నిచోట్ల తాగునీటికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందే
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 265 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నా.. వేసవిలో సులభంగా గట్టెక్కవచ్చనే పరిస్థితులు లేవు. జలాశయాల్లోని నీటిని అన్ని ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు వేసవిలో భూగర్భజలాలు తగ్గుతాయి. అలాంటిచోట్ల నీటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ రక్షిత నీటి సరఫరా విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ఆశాజనకంగా దక్షిణాది ప్రాజెక్టులు