రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలంగాణలోని శంషాబాద్‌లో పశువైద్యురాలి హత్యోదంతాన్ని అన్ని సంఘాలు ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. శంషాబాద్ ఘటనపై చిత్తూరు జిల్లాలో ప్రజలు నిరసన తెలిపారు. పలమనేరులో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. నిందితులను రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. రంగంపేటలోని యువకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళలు లేనిదే మానవ మనుగడ లేదనే నినాదంతో ప్రధాన కూడలి వద్ద శాంతి ర్యాలీ చేపట్టారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కర్నూలులో ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నగరంలోని రాజ్‌విహార్ కూడలిలో మానవ హారం చేపట్టారు. కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం నగరంలో ర్యాలీ చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలూరులోనూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కొవ్వొత్తులతో నిరసన
పశువైద్యురాలి హత్యను నిరసిస్తూ అనంతపురం జిల్లాలోనూ నిరసనల పర్వం కొనసాగింది. హిందూపురంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మృతురాలి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రజా సంఘాలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టాయి.
బహిరంగంగా ఉరి తీయాలి
శంషాబాద్ ఘటనను నిరసిస్తూ విశాఖ జిల్లా చోడవరంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఉషోదయ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా సాగింది. అనంతరం పోలీసులకు వినతి పత్రం అందజేశారు.
యువతిని దారుణంగా హింసించి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ విజయవాడ ఎస్.ఆర్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మహిళల హక్కుల చట్టాలను కఠినతరం చేయాలంటూ నినాదాలు చేస్తూ ఏలూరు రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున నిరసనలు
తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. జగ్గంపేటలో యువత, మహిళలు భారీగా రోడ్డుపైకి వచ్చారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందారని రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు విమర్శించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలోనూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. నరసరావుపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చారు. నగరంలోని టీజేపీఎస్ కళాశాల విద్యార్థులు గుంటూరు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేపట్టారు. మరోవైపు... సేవ్ గర్ల్, సేవ్ ఉమెన్ అంటూ నినాదాలు చేస్తూ గుంటూరులోని ప్రధాన కూడళ్లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
అరబ్ దేశాల మాదిరి చట్టాలు తేవాలి
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నరసాపురంలో రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. తణుకులో కూడా రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి యువ వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మానవ మృగాల దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయ సంఘాలు, జన విజ్ఞాన వేదిక, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. మహిళలపై దాడులను అరికట్టేలా అరబ్ దేశాల్లో మాదిరి భారత్‌లోనూ కఠిన చట్టాలు అవలింభించాలని కోరారు.
ఇదీ చదవండి
'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్