రాష్ట్రంలో 40 శాతం బార్లు తగ్గింపు.. సరఫరా వేళలూ కుదింపు రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. బార్ల విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బార్ల సంఖ్యను తొలుత 50 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించగా.. ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతానికి తగ్గించామని.. విడతల వారీగా తగ్గిద్దామని అధికారులు సూచించారు. దీనిపై చర్చ అనంతరం 40 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మద్యం సరఫరా వేళలు కుదింపు
బార్లలో మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని, రాత్రి 11 వరకు ఆహారం సరఫరా చేయాలని సీఎం సూచించారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం సరఫరా చేయవచ్చని నిర్ణయించారు. మద్యం కల్తీ, స్మగ్లింగ్‌తో పాటు నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం సహా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. మరోవైపు బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.