కరోనా పరీక్షల్లో ప్రభుత్వ బండారం కేంద్ర నివేదికతో బయటపడిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. కొవిడ్ పరీక్షలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి విడుదల చేసిన జాబితాలో ఏపీ పేరు లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు.
కరోనా పరీక్షల్లో ఏపీ ముందుందని చెప్పిన జగన్ దీనిపై ఏం సమాధానం చెబుతారని పట్టాభి నిలదీశారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, దిల్లీ, కేరళ రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఏపీ పరీక్షలన్నీ బోగస్ అని కేంద్రం భావిస్తోందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలకు అనుగుణంగా పని చేయాలని పట్టాభి హితవు పలికారు.