అన్నదాతలపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానంలో పరిపుష్టి లేదని విమర్శించారు. రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికీ రూ. 3,990 కోట్ల విలువైన 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. ధాన్యానికి నగదు చెల్లింపులు చేసే అంశంలో జాప్యం కొనసాగుతుందన్నారు. సకాలంలో సరైన మద్ధతు ధర ఇవ్వకపోవడంతోనే రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువకే అమ్ముకుని దివాళా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారితో సంయుక్త సమావేశం నిర్వహించాలి : సోము
ఈ రకంగా అన్నదాతలు ఏటా వేల కోట్లు నష్టపోతున్నారన్నారు. ఈ లోపభూయిష్ట విధానం మారాలని, వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలన్నారు. మిల్లర్ల ప్రమేయాన్ని మిల్లింగ్ వరకే పరిమితం చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను సైతం రాష్ట్ర సర్కార్ నిర్యక్షం చేసిందన్నారు. ప్రధానంగా రాయలసీమలో మాత్రమే ఈ విధానం ఎక్కువగా ఉందని.. గడిచిన రెండేళ్లలో ఒక్క ఎకరానికీ నీరివ్వలేదన్నారు. టెండర్లు సైతం పిలవలేదని, గత ప్రభుత్వం కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు జగన్ సర్కార్ చెల్లించకపోవడంతో పాటు ఈ ఏడాదీ చెల్లించలేదన్నారు.
పీఎంఏవై ఇళ్లకు మోదీ చిత్రం తప్పనిసరి..
ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మించే ఇళ్లకు తప్పనిసరిగా ప్రధాని మోదీ చిత్రాన్ని వేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పిఎంఏవై పథకం కేంద్రానిదని, రూ. 25 లక్షల నివాసాలను రాష్ట్రంలో నిర్మించేందుకు రాష్ట్ర భాజపా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 15 లక్షల ఇళ్లనే నిర్మించగలమని అనుమతులు తీసుకుందన్నారు.