Carbon Credit Trading Scheme : పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం తగ్గించేందుకు కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ లో భారత ప్రభుత్వానికి ఏపీ పూర్తి తోడ్పాటును ఇస్తుందని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, కంపెనీలు... ఇలా ఎవరైనా కార్బన్ వాయువులను విడుదలను నియంత్రించుకుని కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ లో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు. తద్వారా పర్యావరణ రక్షణకు పాటుపడవచ్చని తెలిపారు. ఏపీ ఇంధన పొదుపు మిషన్ కార్యక్రమాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ఏపీలో 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తున్నట్టు తెలిపారు. ఏపీ ఉత్పాదక సామర్థ్యంలో ఇది 25 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇంధన పొదుపును మరింతగా ప్రోత్సహించి ఏడాదికి మరో 1700 మిలియన్ యూనిట్లను ఆదా చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. దాని విలువ కనీసం రూ.1200 కోట్ల వరకు ఉంటుందని సీఎస్ తెలిపారు.
మార్గదర్శకాలు విడుదల... ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ శాఖలన్నిటికీ మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ పొదుపు ద్వారా 6.68 మిలియన్ టన్నుల ఇంధనాన్ని కూడా ఆదా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించినట్టు వివరించారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో విద్యుత్ ఆదా చేసేందుకు 400 బీఎల్డీసీ ఫ్యాన్లు, 1000 ఎల్ఈడీ వీధి దీపాలు బిగించామని... తద్వారా 1.64 లక్షల యూనిట్లు ఆదా అవుతున్నట్టు అధికారులు సీఎస్ కు వివరించారు. త్వరలోనే ఏపీ ఇంధన పొదుపు మిషన్ ద్వారా ఎకో నివాస్ సంహిత కార్యక్రమం ద్వారా నివాస గృహాల్లో విద్యుత్ ఆదా చేసే ఉపకరణాల వినియోగం, విద్యుత్ పొదుపు చర్యలపై కార్యాచరణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.