ఉత్తర తెలంగాణకు వర ప్రదాయనిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. పునరుజ్జీవన పథకం వినియోగంలోకి రాకముందే ప్రాజెక్టు పూర్వ స్థితికి చేరుతోంది. గత ఐదేళ్లలో 2017 మినహా ప్రతి ఏడాది ప్రాజెక్టులోకి నీరు చేరింది. దీంతో పంటలకు ఢోకా లేకపోవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీళ్లు రాక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపించేంది. ఎగువన మహారాష్ట్రంలో గోదావరి నదిపై ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడం వల్ల దిగువకు నీటి రాక గగనమైంది. గత మూడు దశాబ్దాలుగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ లేకుండా పోయింది. 2011లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా.. మళ్లీ 2016లో మాత్రమే ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీరు వదిలిన సందర్భాలు ఉన్నాయి.
అయితే గత ఐదేళ్లుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మారుతూ వస్తోంది. 2016లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా.. గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత 2017లో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. రైతులు నీటి కోసం ఆందోళనలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కనీసం లీకేజీ నీటినైనా అందేలా చూడాలన్న దయనీయ స్థితి నెలకొంది. అయితే 2018లో కురిసిన భారీ వర్షాలతో ఎగువన ప్రాజెక్టులు నిండటం వల్ల మళ్లీ ప్రాజెక్టు పూర్తిగా నిండి సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఆ తర్వాత 2019లోనూ ప్రాజెక్టు పూర్తి నిండింది. ఇప్పుడు మరోసారి 2020లోనూ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. గత ఐదేళ్లుగా 2017 మినహా ప్రాజెక్టు పూర్తిగా నిండుతూ వస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతోపాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండటం వల్ల మిగులు నీటిని దిగువకు వదిలితే శ్రీరాంసాగర్‌కు చేరుతున్నాయి. ఇలా గత ఐదేళ్లుగా సరిపడా వర్షాలు కరువడం వల్ల ప్రాజెక్టులో నీటి కరవు తీరుతోంది. పునరుజ్జీవన పథకం కింద కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించి పూర్వ వైభవం తేవాలని భావించింది. ఆ పథకం నీళ్లు రాకుండానే ప్రాజెక్టు పూర్వ స్థితికి చేరుతోంది. ఈ పథకం ఇప్పటికే రెండు పంప్ హౌజ్‌లు పూర్తి కాగా ముప్కాల్ పంప్ హౌజ్ పూర్తయితే ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీళ్లు చేరుతాయి.