ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kodi katti case: జైలులోనే నిరాహార దీక్ష చేస్తానంటున్న కోడికత్తి శీను.. ఎందుకో తెలుసా?

Kodi katti case: కోడికత్తి కేసు తదుపరి విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 11కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించాల్సిందిగా జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని రిమాండ్ ఖైదీ శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం కోరారు. లేని పక్షంలో నిందితుడు జైలులోనే నిరాహార దీక్ష చేపడతాడని తెలిపారు.

కోడి కత్తి కేసు విచారణ
కోడి కత్తి కేసు విచారణ

By

Published : Jul 4, 2023, 5:39 PM IST

Updated : Jul 4, 2023, 6:13 PM IST

Kodi katti case: కోడి కత్తి కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది కోరారు. విచారణ వేగవంతం కాకుంటే నిందితుడు జైల్లోనే నిరాహారదీక్ష చేపడతాడని న్యాయవాది సలీం తెలిపారు. కోడికత్తి కేసుపై జూన్ 15న విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీఎం జగన్​ తరఫు న్యాయవాది కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను జూలై 4కి వాయిదావేసింది. కాగా, ఇవాళ విచారణ అనంతరం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని జగన్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కోడికత్తి కేసు నిందితుడి బెయిల్ అంశం తన పరిధిలో లేదని.. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఎన్ఐఏ కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. కోడికత్తి కేసు పై విజయవాడ ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టగా.. నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది సలీం ఎన్ఐఏ కోర్టును కోరారు. ఇప్పటికే ఓ సారి ఇచ్చిన బెయిల్ ను గతంలో హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేయగా.. బెయిల్ అంశం తన పరిధిలో లేదని కోర్టు తెలిపింది. బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణను త్వరితగతిన చేయాలన్న న్యాయవాది సలీం..విచారణ వేగవంతం కాకుంటే నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే నిరాహారదీక్ష చేపడతాడని తెలిపారు.

నాకు విముక్తి కలిగించండి... 2018 సంవత్సరంలో విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసరావును రిమాండ్​కు తరలించగా.. విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 1610 రోజులుగా బెయిల్‌ లేకుండా జైలులోనే గడుపుతున్న శ్రీనివాసరావు.. సీజేఐకి లేఖ రాశాడు. నాలుగేళ్లుగా బెయిల్ లేకుండా ఉంటున్న తనకు కారాగారం నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేశాడు. ఇంకా ఎంతకాలం జైలులో ఉండాలో తెలియట్లేదని.. తక్షణం తనకు విముక్తి కలిగించాలని ఇటీవల రాసిన ఆ లేఖలో వేడుకున్నాడు. గతంలో ఇదే విషయంపై శ్రీనివాస్​ తల్లి సావిత్రి కూడా లేఖ రాయడం తెలిసిందే.

జగన్ అభియోగాలన్నీ కట్టు కథలే..కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర కోణం లేదని ఆ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)... ఈ ఏడాది ఏప్రిల్​ 13న విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో కౌంటర్​​ దాఖలు చేసింది. కేసులో నిందితుడైన శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని, దాడి వెనుక ఎలాంటి పథకం లేదని చెప్తూ.. జగన్‌ అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇక ఎయిర్‌పోర్టులో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని హర్షవర్ధన్‌కు టీడీపీతో, శ్రీనివాసరావు చేసిన దాడితోనూ సంబంధం లేదని వెల్లడించింది. సమగ్ర విచారణ తర్వాతే నిర్ధారణకు వచ్చామన్న ఎన్‌ఐఏ.. తదుపరి దర్యాప్తు అవసరం లేదని, జగన్‌ పిటిషన్లు కొట్టేయాలని విన్నవించింది. దాడికి కొన్ని రోజుల ముందు నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న వాదనలు అవాస్తవమని, సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేస్తున్నాయని, సీసీటీవీ దృశ్యాలను పూర్తిగా విశ్లేషించామని ఎన్‌ఐఏ తెలిపింది.

జైలులోనే నిరాహార దీక్ష చేస్తానంటున్న కోడికత్తి శీను
Last Updated : Jul 4, 2023, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details