లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో తెలంగాణలో పర్యాటకం(Telangana Tourism) తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలతో పాటు.. కాళేశ్వరం ప్రత్యేక యాత్రలనూ తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి రాగానే అక్కడికీ యాత్రలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.
నాగార్జునసాగర్, బాసర, వరంగల్, కొండగట్టు, కరీంనగర్‌తో పాటు పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు తెలంగాణ పర్యాటక సంస్థ(Telangana Tourism) యాత్రలు నిర్వహిస్తోంది. అలాగే తిరుమలతో పాటు.. అక్కడి పుణ్యక్షేత్రాల దర్శనానికి వీలుగా బస్సులతో పాటు విమాన సేవలనూ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
- ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేలా..
తెలంగాణలోని అన్ని పర్యాటక ప్రాంతాల(Telangana Tourism)కు ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రలు నిర్వహిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు లేనందున.. ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా కార్యాలయాల సిబ్బంది.. ఇలా 15 మందికి తక్కువ కాకుండా ఉంటే.. వారిని కోరుకున్న చోటుకు తీసుకెళ్లేందుకు వీలుగా యాత్రలకు రూపకల్పన చేసింది. ఒకవేళ పర్యాటకులే ఎంపిక చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లమని కోరినా సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులు చెప్పారు.
హైదరాబాద్‌కి చేరువలో ఉన్న అనంతగిరి అందాలను ఒక్క రోజులోనే చూసి వచ్చేయాలనుకున్నా.. లేదా ఒక రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు సాయంత్రం తిరిగి చేరుకునేలా స్థానికంగా బస ఏర్పాట్లు కల్పించారు.