Pingali Venkayya: ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ గ్రామం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి. ఎందరో మహానుభావులు నడయాడిన నేల ఇది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యతో పాటు.. సంగీత విద్వాంసులు సుసర్ల దక్షిణా మూర్తి , వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందర రామమూర్తి ఇక్కడి వారే. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ గ్రామంలో జన్మించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మహానుభావులను స్థానికులు స్మరించుకుంటున్నారు. తమ వారి గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటున్నారు.
Pingali Venkayya School: అఖండ భారతావని సగర్వంగా తలెత్తుకునే జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యను గుర్తు చేసుకుంటున్న పెదకళ్లేపల్లి వాసులు.. ఆయనను తెలుగుజాతి ముద్దుబిడ్డగా అభివర్ణిస్తున్నారు. చల్లపల్లి మండలం యార్లగడ్డ నివాసి హనుమంతరాయుడు, వెంకటరత్నం దంపతులకు పింగళి వెంకయ్య జన్మించినా.. చిన్నప్పటి నుంచితాతయ్య అడవి వెంకటాచలపతి వద్దే వెంకయ్య పెరిగారు. పింగళి చిన్నతనంలో పెదకళ్లేపల్లి పాఠశాలలో విద్యాభ్యాసం చేసినట్లు అడ్మిషన్ రిజిస్టర్‌లో పేరుంది. పింగళి వెంకయ్య పేరు.. వెంకన్నగా నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మహానుభావుడు ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన బడికి.. ఆయన పేరే పెట్టాలని కోరుతున్నారు.