పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను హింసించసాగాడు. ప్రజలంతా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. ప్రజల ఆక్రందనలూ ప్రార్థనలూ విన్న శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుడిని సంహరిస్తాడు. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశినాడు నరకుని పీడ వదిలింది కాబట్టి ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణాసంచాలు కాల్చారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది పురాణాలు చెబుతున్నాయి.
ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపిన ఆ నరకాసుర వధ.. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు ప్రాంతంలోనే జరిగిందని స్కంధ పురాణం చెబుతోంది. నదీతీర గ్రామమైన నడకుదురు ఆనాడు నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లింది. నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై.. ఇక్కడ వెలసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణ కథనం. ఆ తరవాత శ్రీకృష్ణుడు దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడట. నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో నరకొత్తూరు, నడకదూరు, నడకుదురుగా రూపాంతరం చెందింది. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి.
పృథ్వీశ్వరుణ్ణి పూజిస్తే సంతానం..
ద్వాపరయుగం నాటికే ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు పృథ్వీశ్వరుడిగా వెలిశాడు. లక్ష్మీనారాయణుల ఆలయమూ ఉంది. నరకాసురుడు ఇక్కడ ద్విముఖుడు అనే బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఆ పాప పరిహారార్థం పృథ్వీశ్వరుడికి పూజలు చేశాడట. ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ఎత్తులో ఉండేదట. కాలగర్భంలో మార్పుల కారణంగా భూమి కంటే తక్కువ ఎత్తులోకి దిగిపోయింది. ఇది మిగతా ఆలయాల్లా కాకుండా పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. దీనికి ఎదురుగా కృష్ణా నది ప్రవహిస్తుంటుంది. పృథ్వీశ్వరుణ్ణి పూజిస్తే సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం.