కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో 2016లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్టీఆర్ హైస్కూల్.. అనాథలకు విద్యాబోధనలో సమున్నత సేవను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇక్కడ విధ్యాభోధన జరుగుతోంది. పాఠశాల ఆవరణలో హాస్టల్ వసతి, సువిశాల క్రీడా మైదానం, ఆహ్లాదమైన వాతావరణం కల్పించే పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు... ఒకటేమిటీ ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా.. అనాథలకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభోధన అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన 700 మంది విద్యార్థులు.. ఇప్పుడు ఉన్నత చదువుల్లో ఉన్నారు. మరికొందరు ఉదోగ్యాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు.
ఎన్టీఆర్ ట్రస్ట్: ఉపాధ్యాయులే అమ్మనాన్నలై..! - అనాథపిల్లలకోసం ప్రత్యేక పాఠశాల
అక్కడ చదివే పిల్లల్లో చాలా మందికి తల్లిదండ్రులు లేరు.. ఒకవేళ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో చదివించలేరు. అందుకే.. ఉపాధ్యాయులే అమ్మానాన్నలై వారిని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఇంటర్ వరకూ చదువు చెబుతున్నారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆశయాలకు ప్రత్యక్ష రూపంగా నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ఈ బృహత్ కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా.. 15 లక్షల వ్యయంతో 5 డిజిటల్ తరగతులు అందుబాటులోకి తెచ్చారు.
![ఎన్టీఆర్ ట్రస్ట్: ఉపాధ్యాయులే అమ్మనాన్నలై..! ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుకుంటున్న పిల్లలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5968908-691-5968908-1580923061593.jpg)
15 లక్షల రూపాయల వ్యయంతో 5 డిజిటల్ తరగతి గదులను ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులతో మమేకమై... సమాజంలో ఎలా ఉండాలో తెలియజేశారు. చదువు ఒక్కటే ఉన్నత స్థానం తీసుకువస్తుందని ప్రతి ఒక్కరూ ఒక్కో ఎన్టీఆర్ అవ్వాలని ఆమె కోరారు.
అనాథ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించటమే లక్ష్యంగా సాగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యానికి విద్యార్థులంతా రుణపడి ఉంటామని చెబుతున్నారు. ట్రస్ట్‌లో చదువుకునే విద్యార్థులు..ఉపాధ్యాయులే తమకు అమ్మానాన్న అంటున్నారు. మంచి లక్ష్యంతో ముందుకు వెళుతున్న ట్రస్ట్‌ను అందరూ అభినందిస్తున్నారు.