వాతావరణ పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా... నాణ్యమైన మొక్కలు వినియోగించకపోతే ఎంత కష్టపడినా ఆశించిన పంట దిగుబడి రాదన్నది నగ్నసత్యం. ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసి కొన్ని సందర్భాల్లో రైతులు నష్టపోతున్న ఉదంతాలు ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సొంతంగా కొన్ని పంటలకు నర్సరీల్లో మొక్కలు పెంచి రైతులకు విక్రయిస్తోంది.
అన్ని మొక్కలు తక్కువ ధరలోనే
కృష్ణా జిల్లా వెల్లటూరులోని ఉద్యానశాఖ నర్సరీలో ఈ ఏడాది 35 వేల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కొబ్బరి, వాక్కాయ, కరివేపాకు, మునగ, మామిడి, ఇతర పుష్పజాతుల మొక్కలను అభివృద్ధి చేసింది. వీటిని కేవలం కృష్ణా జిల్లా వాసులకే కాకుండా ఎవరికైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. కొబ్బరి మొక్క ఒకటి 60 రూపాయలకు... ఇతర మొక్కలను ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించింది.
తోటబడితో అవగాహన
తోటబడి కార్యక్రమం పేరిట నర్సరీల్లోని మొక్కల కొనుగోలుకు రైతుల్లో అవగాహన పెంచుతోంది ఉద్యానశాఖ. పొలం గట్లతోపాటు ఖాళీ ప్రదేశాల్లో కొబ్బరి మొక్కలను పెంచుకోవడం వల్ల 4 నుంచి ఏడేళ్లలో మంచి దిగుబడి మొదలై- సాగుదారునికి ఏ విధంగా అండగా నిలుస్తుందనేది ఈ తోటబడి అవగాహన సదస్సుల్లో అధికారులు వివరించారు.