రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీని పటిష్టంగా అమలు చేసే దిశగా ఈ కొత్త శాఖకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో తొలి వీడియో కాన్ఫరెన్స్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగింది.
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విధి విధానాలను జిల్లాల ఎస్పీలకు డీజీపీ వివరించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.., పనితీరు, ఎస్పీలతో చర్చించారు. అక్రమ ఇసుక తవ్వకాలు నివారణ, అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు, వారెంట్లను అమలు చేయడం, పీడీ యాక్టులను ప్రయోగించడం ప్రాధాన్యతా అంశాలుగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించారు. ఫలితాలను సాధించేందుకు విప్లవాత్మక చర్యలను తీసుకోవాలని సూచించారు.