మార్చి 4న తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలపై సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మొత్తం 41 అజెండా అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు.
అభివృద్ధి మండలి సమావేశంలో..
జలవనరులు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ, సహకార,హోం,పరిశ్రమలు,వాణిజ్యం, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఇంధన తదితర శాఖలకు చెందిన కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై అభివృద్ధి మండలి సమావేశంలో చర్చించనున్నారు. మిగతా 15 రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది.
15 అంశాలు..
రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన 15 అజెండా అంశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు, విశాఖ-చెన్నెపారిశ్రామిక నడవా, ప్రధాన మంత్రి హామీల్లో భాగంగా పన్ను ప్రోత్సాహకాలు, కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, నూతన రాజధాని ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ సహకారం, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో రైలు ఏర్పాటు, దుగ్గరాజుపట్నం పోర్టు ఏర్పాటు వంటి అంశాల పై చర్చించనున్నారు.