Solar power plant: నెడ్ క్యాప్ ద్వారా రాష్ట్రంలో తొలి రూఫ్ సోలార్ ప్రాజెక్టును విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. 70కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో స్టేడియంలోని వీఐపీ గ్యాలరీపైన 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ సిద్ధం చేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్.. మిగిలిన సోలార్ ప్యానళ్లకు భిన్నం. వర్షం పడినా ఇందులో నుంచి నీళ్లు కిందకు వెళ్లవు. రాష్ట్రంలోనే మెుదటిసారిగా నెడ్ క్యాప్ సంస్థ ఈ లీక్ ప్రూఫ్ సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేసింది. మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ నుంచి నగరంలో మంచినీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ పంపిణీ చేస్తారు.
ఈ సోలార్ రూఫ్ టాప్ విజయవంతమైతే రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు నెడ్ క్యాప్ అధికారులు చెబుతున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు నెడ్ క్యాప్ అధికారులు తెలిపారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోలార్ ప్యానళ్లను రూఫ్ టాప్‌లపై ఏర్పాటు చేయటం వల్ల స్థలం కలిసి వస్తోందని, పర్యావరణానికి హాని ఉండదని అధికారులు చెబుతున్నారు.