ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచుల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ) కోర్సులు చదువుతున్న వారూ తమను తాము మార్చుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దాంతో కంపెనీలు విద్యార్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.
- విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అసెంచర్, టీసీఎస్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయి. సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి రూ.7.2 లక్షల మధ్య వేతన ప్యాకేజీలు పొందారు. వీరిలో కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉండటం గమనార్హం.
- విజయవాడ ఎన్ఆర్ఐ కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించారు. ఈఈఈ చదివే హరితేజ 4 కంపెనీలకు ఎంపికయ్యారు. రూ.4.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల ప్యాకేజీ వరకు వచ్చాయి.
- విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్తులో ఈ ఏడాది 168 మంది విద్యార్థులు రూ.3.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ప్యాకేజీలు సాధించారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన మరో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్ జెమినీ, టీసీఎస్ ఇన్పోసిస్లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
కరిక్యులమ్‌లోనూ మార్పులు
స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు బేసిక్ ప్రోగ్రామింగ్‌ను కరిక్యులమ్‌లో భాగం చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు కోడింగ్, ప్రోగ్రామింగ్, డాటా స్ట్రక్చర్స్, పైథాన్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై శిక్షణ ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు స్వయం పోర్టల్‌లోని కోర్సులు పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం అందిస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు.
అదనపు కోర్సులతో టీసీఎస్‌లో ఉద్యోగం
నేను ఈఈఈ నాలుగో ఏడాది చదువుతున్నా. ఇందులో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున సాఫ్ట్‌వేర్‌వైపు వెళ్దామని పైథాన్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా నేర్చుకున్నా. ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్సులు చేశా. టీసీఎస్ డిజిటల్లో రూ.7.2 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా.
కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై అవగాహన అవసరం