ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎంతోమందికి ఉపాధి చూపిన సామాజిక వేత్త మాదాసి జార్జి ఫెర్నాండేజ్ (64) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన వారు. ప్రభుత్వం అందించే వివిధ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులకి మిషన్ ట్రైనింగ్, కళంకారి ప్రింటింగ్.. జీవనోపాధి పనులకు ఆయన ఉచిత శిక్షణ ఇప్పించేవారు. కృష్ణా జిల్లాలో ముందడగు పథకం ఏర్పాటు చేసిన జార్జి.. పథకానికి జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు.
నాటి కలెక్టర్ ఎంవీఎస్ రెడ్డి సహకారంతో... ముందడగు పథకం ద్వారా ఎంతో మంది శిక్షణ ఇప్పించారు. ఘంటసాల, కోడూరు, తేలప్రోలు, రామన్నగూడెం.. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి కల్పించారు. కోళ్ల పెంపకం ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. జార్జి ఫెర్నాండేజ్ కు భార్య అమ్మాజీ, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతిపై ప్రజా ప్రతినిధులు, స్థానికులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.