కరోనా కారణంగా కుదేలవ్వని రంగం అంటూ ఏది లేదు. కరోనా ప్రభావంతో ఉన్న ఉపాధిని కోల్పోయి చాలామంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామికవాడ ఎలీప్ సైతం లాక్‌డౌన్ సమయంలో మూతపడింది. పరిస్థితులు క్రమక్రమంగా కుదుటపడడంతో మళ్లీ చిన్నతరహా పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. విజయవాడకు చెందిన వల్లభనేని ప్రసన్నలక్ష్మి.. సూరంపల్లిలో డయాలసిస్, హెచ్ఐవీ, సర్జికల్ కిట్లు తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా పీపీఈ కిట్లు, మాస్కులు, ఫేస్‌షీల్డుల తయారీ ప్రారంభించారు. వీటితోపాటు సర్జన్ గౌన్లు, కవర్లు, టోపీలు, బెడ్‌షీట్లు తయారు చేస్తున్నారు.
విజయవాడ సహా చుట్టుపక్కల ఉన్న అనేక ఆసుపత్రులకు వీరు ఉత్పత్తులను అందిస్తున్నారు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తే తమ సేవలను విస్తరిస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. కరోనా కాలంలో ఆర్ధికంగా అవస్థలు పడిన కార్మికులు.. కాలానుగుణంగా తమ వ్యవహారశైలిలో మార్పులు చేసుకున్నారు. గతంలో పనిచేసిన పరిశ్రమల్లోనే మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల తయారీలో మెళుకువలు నేర్చకుని బతుకుబండిని నెట్టుకొస్తున్నారు.
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన రేష్మా.. పదేళ్ల క్రితం పంజాబీ ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. బ్యాంకు ఆఫ్ మహరాష్ట్ర సహకారంతో పండ్ల రసాలు, నిల్వ ఉండే ఆహార పదార్ధాలను తయారు చేసేవారు. కరోనా ప్రభావంతో వ్యాపారం పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కల్పించిన భరోసాతో ఇతర ఉపాధి మార్గాల వైపు అన్వేషించారు. కరోనా కాలంలో ప్రజలంతా రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధాలు వినియోగిస్తున్నందున.. ప్రకృతి సహజసిద్ధమైన పదార్ధాల తయారీ వైపు మళ్లారు. తులసి ఆకులతో ద్రావణం, సుగంధ వేళ్లతో నన్నార్ వంటివి తయారు చేస్తున్నారు.